గాంధీకి నోబెల్ బహుమతి రాబోతుందా? అది కూడా చనిపోయిన 80 సం. ల అనంతరం?
మరణానంతరం ఇవ్వకూడదన్న 1974 నోబెల్ కమిటీ నిర్ణయానికి తిలోదకాలా? వెసులుబాటా?
ప్రపంచ చరిత్రలో అసాధారణమైన ముద్రవేసిన మహాత్మా గాంధీని ఎట్టకేలకు నోబెల్ శాంతి బహుమతి వరించనున్నదా ?
ఎక్కువగా రాజకీయ కారణాలతో ఈ బహుమతి ఆయనకు నిరాకరిస్తూ వస్తున్నారని ఆరోపణలు నెలకొన్న నేపధ్యంలో ఆయన మృతి చెందిన 80 సంవత్సరాల అనంతరం, ఆయన 150వ జయంతి ఉత్సవాలు జరుకొంన్న సమయంలో ఈ బహుమతి ప్రకటించాలని నోబెల్ కమిటీ వత్తిడులకు గురవుతున్నదా ? మరో మూడు రోజులలో ఈ బహుమతి ప్రకటించినప్పుడు ఈ విషయం తేలనున్నది.
ప్రతిష్టాత్మక నోబెల్ కమిటీ గాంధీజీ జయంతి సందర్భంగా తన ట్విట్టర్ అకౌంట్‌లో మహాత్మా గాంధీని స్మరించుకోవడంతో ఇటువంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి.
చావును ఎదుర్కొనేందుకు తన వద్ద అనేక కారణాలు ఉన్నాయని, కానీ ఒకర్ని చంపేందుకు తన వద్ద ఎటువంటి కారణాలు లేవని గాంధీ చేసిన సూక్తిని ఆ ట్వీట్‌లో పోస్టు చేశారు.
అక్టోబర్ రెండవ తేదీని అంతర్జాతీయ అహింసా దినంగా పాటిస్తున్నట్లు నోబెల్ ప్రైజ్ కమిటీ పేర్కొన్నది. 12 సార్లు నోబెల్ శాంతి బహుమతి కోసం గాంధీ పేరును నామినేట్ చేశారని కూడా నోబెల్ కమిటీ ఆ ట్వీట్‌లో గుర్తు చేసుకున్నది.
బాపూజీకి శాంతి నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ నోబెల్ కమిటీ వద్ద అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలోనూ అనేక మంది గాంధీకి శాంతి బహుమతి ప్రకటించాలని కోరుతున్నారు.
నోబెల్ పీస్ ప్రైజ్‌ను గాంధీకి అందజేసేందుకు మరింత ఆలస్యం చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరణానంతరం కూడా అనేక మంది ప్రముఖులకు నోబెల్ పురస్కారం దక్కిందని పేర్కొంటున్నారు. గతంలో రెండుసార్లు మరణానంతరం ఇద్దరికి నోబెల్ బహుమతులను అందజేశారు. వాస్తవానికి మరణానంతరం నోబెల్ ఇవ్వకూడదని ఆ కమిటీ 1974లో నిర్ణయం తీసుకున్నది. అవార్డు ప్రకటించిన తర్వాత ఒకవేళ ఆ వ్యక్తి మరణిస్తే, వారికి ఆ అవార్డు ఇవ్వవచ్చు.
కానీ 1974 కంటే ముందు రెండు సార్లు మరణానంతరం నోబెల్ ఇచ్చారు.
1961లో డాగ్ హమ్మర్స్‌కీ నోబెల్ శాంతి బహుమతి దక్కింది. అంతకుముందు,
1931లో సాహిత్యంలో ఎరిక్ యాక్సెల్ కార్ల్‌ఫెల్డ్ నోబెల్ అందుకున్నారు. అయితే ఈ ఇద్దరికీ మరణానంతరం నోబెల్ దక్కడం విశేషం.
2011లో మరో అనూహ్య ఘటన జరిగింది. ఆ ఏడాది అవార్డు ప్రకటనకు కేవలం మూడు రోజుల ముందు రాల్ఫ్ స్టీన్‌మన్ చనిపోయారు. అయినా కానీ నోబెల్ కమిటీ మెడిసిన్‌లో రాల్ఫ్‌కు నోబెల్ బహూకరించింది. ఈ నేపథ్యంలో ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన గాంధీని ఇప్పుడైనా నోబెల్ శాంతి బహుమతితో సన్మానించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని .. గాంధీకి నోబెల్ శాంతి బహుమతి దక్కేలా చూడాలని డిమాండ్లు వస్తున్నాయి.
ఇలా ఉండగా, మరోవంక గాంధీజీకి అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వాలని అగ్రరాజ్యం అమెరికా భావిస్తున్నది. మహాత్మాగాంధీని గోల్డ్ మెడల్‌తో గౌరవించేందుకు అమెరికా చట్టసభ ప్రతినిధులు భావిస్తున్నారు. అమెరికా రాజకీయాల్లో పలుకుబడి కలిగిన ఓ అరడజను మంది చట్టసభ ప్రతినిధులు దీని కోసం చట్టసభలో ప్రతిపాదన కూడా చేశారు.
ఆ బృందంలో నలుగురు భారత సంతతి సభ్యులు కూడా ఉన్నారు. శాంతి, అహింస కోసం కృషి చేసిన బాపూజీని గోల్డ్ మెడల్‌తో సన్మానించాలని నిర్ణయించారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో కరోలిన్ మలోనే ఈ ప్రతిపాదన చేశారు. సెప్టెంబర్ 23వ తేదీనే ఈ ప్రతిపాదన జరిగింది. చట్టసభ ప్రతినిధులు అమీ బిరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమిలా జయపాల్‌లు ఆ టీమ్‌లో ఉన్నారు.
అమెరికాలోని సంయుక్త సభలు అత్యున్నత పౌర పురస్కారం కింద గోల్డ్ మెడల్‌ను ఇస్తుంది. చాలా తక్కువ మంది విదేశీయులు ఇప్పటి వరకు ఈ అవార్డును గెలుచుకున్నారు. మదర్ థెరిసా(1997), నెల్సన్ మండేలా(1998), పోప్ జాన్ పాల్-2(2000), దలైలామా(2006), ఆంగ్ సాన్ సూకీ(2008), మొహమ్మద్ యూనిస్(2010), షిమోన్ పీరస్(2014)లు గతంలో అమెరికా పౌర పురస్కారాన్ని అందుకున్నారు.

No comments:
Post a Comment