Saturday, July 28, 2018

ప్రపంచం ముందుకు పోతుంటే, మమ్మల్ని 1500 సం. కృతానికి చావడి కట్టి, మమ్మల్ని మౌన మాంసాలుగా ఉత్పత్తి యంత్రాలుగా బతకమన్న మీ సాంప్రదాయానికో సలాం..

"ఇవ్వాల్టి ..పద్నాలుగేళ్ల నా వసంతాన్ని...,
అరవై యేండ్ల శిశిరానికి అంకితమియ్యమంటే...,
నా శరీరం ముద్ద కు వాడు వెల కడుతుంటే..,
కటికోడు కిలోలకొద్ది మాంసం అమ్మినట్టు..,
కిరాతకంగా నన్ను వ్యభిచార బానిసగా అమ్మేస్తుంటే...,

స్వేచ్ఛ..! ఏది..? ఎక్కడ..??
అనుభూతించటానిక్కూడా కూడా అర్హత లేనిదాన్ని..,
అరబ్ కభేళాలో..
ఆడదాని మాంసానికి ఇంత రేటుందని తెలియనిదాన్ని (పర్దా హఠాకే దేఖో నుండి..)

ఇలాంటి, అస్తిత్వ కవిత్వానికి హస్త రేఖ... షాజహానా!

ఆధునిక తెలుగు సాహిత్యంలో పరిచయమక్కర్లేని పేరు.... షాజహానా తెలుగు లో M.PHIL, తర్వాత డాక్టరేట్.. చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆమె, 2017 లో జాతీయ అవార్డు గెలుచుకున్నారు..! 'నఖాబ్'(ముసుగు)ముస్లీం స్త్రీ కవిత్వంతో సంచలనం రేపిన 'లద్దాఫ్ని'!!

ఇటీవలే లద్దాఫ్ని సంకలనంతో కధారచయిత్రిగా కొత్త
అవతారమెత్తింది. కవిత్వం కావచ్చు, లేక కధ కావచ్చు.. ప్రక్రియ ఏదైనా అస్తిత్వ ముద్ర తప్పనిసరి!
1993లో వచ్చిన నీలిమేఘాల కవితాసంకలనం లో. 'అలాగే అన్నారు' అనేకవిత రాసిన రజియా
బేగం తో ధునిక తెలుగు సాహిత్యంలో ముస్లిం స్త్రీకవుల ప్రస్ధానం ప్రారంభమైంది. అయితే 1991
లోనే 'బతికిన గోడలు' శీర్షికతోమహెజబీన్ రాసిన కవిత కంజిర బులెటిన్ లో ప్రచురితమైంది. అయితే
ముస్లిం అస్తిత్వ ప్రస్తావన లేని కవిత ఇది. అందువల్ల రజియాబేగం కవితేతొలి ముస్లిం ప్రస్తావన కవితగా
నిర్ధారించారు. మహెజబీన్ క్రమంతప్పకుండా 1991 నుండి ఒకటీ, అరా కవితలు రాస్తూ వచ్చింది. 1995లో
రాసిన పచ్చనిజీవితం కవితలో  మొదటిసారి కులాల ప్రస్తావన తెచ్చింది 'నేను మజీద్...తనుమందిర్'
అంటూ రెండు విభిన్న కులాల దాంపత్య జీవితం గురించి చర్చించింది. ఆ తర్వాత 'అజ్నబి' ఖిల్వత్ కవితల్లో
ముస్లింల ప్రస్తావన తెచ్చింది..

అటు తర్వాత 1997లోషాజహానా కవిత్వం మొదలైంది.1998లోవచ్చిన జల్ జలా సంకలనంలోషాజహానా కవితలు చోటుచేసుకున్నాయి. జబీన్ కవితలు కలగాపులగం కాగా షాజహానాకవిత్వం
మొత్తం ముస్లిం అస్తిత్వ వాద ప్రస్తావనే. అందువల్ల అస్తిత్వ వాదకవిగాషాజహానా కు ప్రత్యేక గుర్తింపు లభించింది. '

"నఖాబ్' వెనుక ముస్లిం స్త్రీలు పడేబాధల్ని బహిరంగ పరిచింది. పరదాల వెనుక వున్న మౌనాన్ని,రాజీ మనస్తత్వాలనీ ఎండగట్టింది. సాంప్రదాయాల చాటుమాటున జరిగే హింసను తునుమాడింది. పురుషాధిక్యానికి తలొంచి బతికే సగటు
ముస్లిం స్త్రీల నిస్సహాయత నిగ్గు తేల్చింది. ముస్లిం వాద కవిగా తనకంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని సుస్థిరం చేసుకుంది.

'వెర్రి ఆచారాల మఱ్ఱి వృక్షా లున్నచోట...
ఒక్కసారి ముసుగు తీసి చూడు......
లోపలి స్వేచ్ఛా వెలుతురు పరిమళాన్నంతా
వెదజల్లి వెలుగుతున్న  నా గుల్ మొహర్ ఆడవాళ్ళను చూడు...
....................................................................
ఈ తరం స్త్రీలను చూస్తూ
ఇంకా ఇంకా మౌనంగా వుండటం నావల్ల కాదు
మాటలు రానప్పుడు ఏమోకానీ
పోరాటం చేయగలిగినప్పుడు కూడా చేతులు కట్టుక్కూర్చోడం, ఇకపై నా వల్ల కాదు......"

పరదాల వెనుక మూసుకుపోయిన ముస్లిం స్త్రీల గొంతుకలకు ప్రతినిధిగాషాజహానా తీవ్రస్వరంతో
విరుచుకు పడింది. వారి తరపున పోరాటానికి నడుంకట్టింది.

మగ శరీరాల ఖడ్గాలకింద
మాంసఖండాలవడానికేనా మన జీవితాలు?
వాడు ముసలాడయినా
ముగ్గురు పెళ్ళాలతో ముచ్చట తీర్చుకోవచ్చు
మనం నఖాబ్ ఎత్తితే.... భూకంపమా??!

అనార్కలీ..
ఇప్పుడైనా త్యాగాల పేజీని బతుకులోంచి చించి
రివాజుల ముందేస్తున్నా!
నీ ఆగిపోయిన శ్వాసని పునరుధ్ధరించడానికి
ఒక్కొక్క ఇటుకనే పెళ్ళగిస్తున్నా!!

మగవాడి ఆధిపత్యం,వాడి ముచ్చట కోసం, విలాసాల కోసం స్త్రీల బలిదానాలు రివాజుగా మారాయి.
త్యాగాల పేరుతో స్త్రీలు ఇలా ఎంతకాలం అణచివేతకు గురికావాలి? అందుకే ఈ త్యాగాల పేజీలను
ఒక్కొక్కటీ చించివేస్తున్నాననడం వ్యవస్థపై తిరుగుబాటు ప్రకటించడమే.

అనాదిగా ముస్లీం స్త్రీలు అణచివేతకు గురవుతూనేవున్నారు. ప్రేమే పాపమంటూ అనార్కలిని అక్బర్ సజీవ సమాధి చేశాడు. దీన్ని ప్రతీకగా తీసుకొని ముస్లింసమాజలోని హైన్యాన్ని, దైన్యాన్ని ఎదుర్కోటానికి సమాధిలోని ఒక్కో ఇటుకను తొలగిస్తున్నాననడం షాజహానా మొక్కవోని ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తోంది.
 
నిజంగా నిఖా కుట్రే
షాదీ అయిన నాటినుండీ
నేను అతని హవాలా అయిన నాటినుండి
ఆకాశమంత నవ్వుని కత్తిరించి
చిర్నవ్వుగా మార్చాడు
.................
నా మాట నా నవ్వు
అన్నీ నిషేధాలైపొయ్యాయ్.
.........................
ఏ అర్ధరాత్రో అతని కామం లాకులెత్తినపుడు
నేను నవరస నాయికనై ప్రవహించాలి
కదలని అతని కాలం ఓడకి నేనో తెరచాప!"

పరదాల వెనుక ఇంత బాధవుందన్న విషయాన్ని షాజహానా ముక్కుసూటిగా చెప్పిన తీరు సాంప్రదాయ
వాదులకు కోపంతెప్పించింది. పడగ్గది రహస్యాల్ని పచ్చిగా చెప్పటం ముల్లాలకునచ్చలేదు.ఈ తీవ్ర ధోరణే
షాజహానా కలానికి బలమిచ్చింది. స్త్రీ స్వాతంత్యం సరే....ముందు వాళ్ళ అస్తిత్వాల మాటేమిటంటూ షాజహానా ప్రశ్నించింది.

అస్తిత్వవాద పోరాటానికి కవిత్వ పరిమళాలద్దిన నఖాబ్ సంపుటి సాంప్రదాయవాదులకు కోపం తెప్పించింది. గుండెల్లో కుంపటిరగిలించింది.

తాను దూదేకుల (లద్దాఫ్)కులంలో పుట్టింది..ముసల్మానుల ఇంటికి కోడలైంది.
కల్చరల్ క్లాష్....

విభిన్న మతాల సంస్క్రుతుల మద్య వైరుధ్యం..
తన ఉనికి, అస్తిత్వం కనుమరుగయ్యే సందర్భం.
తిరగబడింది. నా కులం నాదే... నా సంస్కృతి నాదే...
నా అలవాట్లు నావే...ఎవరికోసమో నేనెందుకు మారాలి.?

"నా దూదేకుల తనాన్ని షోహర్(భర్త)ఆపాదిచుకోనప్పుడు
అస్లీ ముస్లిం ముద్రని మాత్రం నేనెందుకు భరించాలి" అంటూ నిలదీసింది.

"అబ్ సౌబార్ సబ్కేసామ్ నే చిల్లావుంగీ
 హా..మై లద్దాఫ్ని హూ....
 లద్దాఫ్నీ హీ రహూంగీ......

తన దూదేకుల కులాన్ని భర్త ఆపాదించుకోనప్పుడు, అతని కుల ముద్రను తానెందుకు భరించాలంటూ
నిలదీసింది. తను తాను గానే వుంటానంటూ స్వరం పెంచి మరీ చెబుతోంది.

"ఇప్పుడు అందరిముందు వందసార్లు బిగ్గరగా అరుస్తూ చెబుతాను...అవును నేను దూదేకులదాన్నే.
దూదేకులుగానే వుంటాను!"

తనదైన వ్యక్తిత్వ ఆవిష్కరణలో...షాజహానా తెగింపు చూపింది. మెట్టినింటికెళ్లినా...పుట్టింటి అస్తిత్వాన్ని కోల్పోరాదన్న నిర్ణయం ఆమె వ్యక్తిత్వానికి మెచ్చుతునక. తరతరాలుగా ముస్లిం సమాజంలో వేళ్ళూనుకున్న పురుషాధిక్య భావనను, అహంకార స్వభావాన్ని తుదికంటా పెకిలించే ధోరణి నకాబ్ లో కనిపిస్తుంది.

ఎటువంటి జంకు, గొంకు, గోషా, పర్దాలేకుండా
తన భావాలను నిస్సంకోచంగా వెల్లడిస్తుంది. మూఢాచారాల ముసుగులో....సాంప్రదాయాల పరదాల వెనుక మగ్గే ముస్లిం స్త్రీల మనోభావాల చిత్రీకరించి,వారిని మేల్కొలిపే దిశగా షాజహానా తన కవిత్వాన్ని కరవాలంగా ఝళిపించిది. నఖాబ్ వెనుక వున్న చీకటికోణాలను ప్రతిభావంతంగా ఆవిష్కరించింది.పవిత్ర గ్రంథాన్ని చదివే వాళ్లు ప్రపంచాన్ని కూడా చదవాల్సిన అసరముందని చాటి చెప్పింది! ముస్లిం స్త్రీ వాదంలో షాజహానా స్వరం ఓ వరమైంది!!

#ఎంత బాధ..!
కనీ.. కనీ..జారిపోయిన గర్భసంచులు ..
బొమ్మిడికం చేసీ.. చేసీ..పికిలిపోతున్న శరీరాలు..!
జల్లెడైన మనసులు..!
వీటిలో ఒక్క బాధైనా ఈ మగాళ్లు అనుభవిస్తున్నా రా..?
(కొన్ని లైన్స్.. Chinna Pinisetti టైమ్ లైన్ నుండి.. మిగతా, స్త్రీ మూర్తి కవితా సంపుటి నుండి..)
With Devi Varma Santhi Mallesan Common Man Srinivas Prabhakar Rao Muthenna Joola

http://www.thehansindia.com/posts/index/Khammam-Tab/2017-03-07/Khammam-poet-wins-state-award/285125

https://www.poetryfoundation.org/poetrymagazine/browse?contentId=49808

         


No comments:

Post a Comment

దీనిని పుజీ అంటారు . అతీంద్రియ శక్తులే మనను ఆవహించి భవిష్యత్ ను తెలియజేస్తాయని ఓ నమ్మకం .

మంత్ర సాధన కల్పద్రుమమ్ ఊజా బోర్డ్ :- ఊజా అంటే స్పానిష్ భాషలో లిపిఫలకం అని అర్థం .  దీనిని సా. శ ౧౧౦౦.పదకొండు వందల సం . ప్రాంతంలో  చైనాలో విర...