Saturday, May 1, 2021

ఈ తాటి చెట్టునే జీవనాధారంగా చేసుకునిగౌడ కులం గౌరవ ప్రదంగా హుందాగాఇప్పటికీ జీవిస్తోంది. కల్లు గీత కార్మికులుగా వీరంతా మనకు సుపరిచితులు !

#తాటిచెట్టు
 దశావతారాల్లో వామనావతారం మనకు తెలుసు కదా !

ఆయన తాటాకు గొడుగు ధరించే బలి చక్రవర్తి దగ్గరకొస్తారు !
అంత ప్రాచీన కాలం నుంచే తాటి చెట్టు మన సంస్కృతిలో భాగమైంది‌ !
ప్లాస్టిక్ కు, ఏసి లకు దూరంగా జీవించమని పర్యావరణ వేత్తలు చెవుల్లో ఇల్లు కట్టుకుని మరీ చెప్తున్నారు !

అలా ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా మనకు ఉపయోగపడుతుంది 
ఈ బయో మెటీరియల్ ఎలిమెంట్ !

తాటిచెట్టులోని ప్రతి భాగం.. 
మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి.

మన పూర్వీకులు రాసిన ఉద్గ్రంధాలన్నీ.... తాటాకుపై 
నిక్షిప్తమై ఇప్పటికీ భద్రంగా ఉన్నవే !

మన చరిత్ర... 
తాటాకులో సజీవంగా 
జీవించి ఉన్నది !

365 రోజులు నివసించడానికి 
మన పూర్వీకులు కట్టుకున్న...
పూరిళ్ళనే తీసుకుంటే...
తాటి చెట్టునే.... పిల్లర్లు గా నిలిపి,
వాటిపై‌న తాటి దూలాలు బిగించి,
తాటి చెట్టు కాండంతో చేసిన  వాసాలతో.. 
ఇంటి పైకప్పుకు ఫ్రేమ్ నిర్మించి, వాటిపైన తాటాకుని కప్పి, 
అదే తాటాకు కాండం నుంచి తీసిన నారతో దానిని తాటి వాసాలకు బంధించి,
చక్కటి పొదరిల్లుని 
నిర్మించుకోవడం
పాత కాలపు భోగం !

పూర్తి పర్యావరణ 
అనుకూలమైన నిర్మాణం !

ఏసీ అవసరం లేకుండా చల్లగా హాయిగా ఉంటుంది.

సిమెంట్, ఇటుక, ఇసుక, ఇనుము, కంకర లాంటి మెటీరియల్స్ లేకుండానే
ఒక్క తాటి చెట్టుతో.... తయారైన ఈ ఇళ్ళు పూర్తి పర్యావరణ హితం !

ఈ వేసవి ఎండ వేడి తట్టుకోవడానికి
ఇప్పటికీ కాంక్రీటు ఇళ్ళకు పైన తాటాకులను కప్పటం మనకు తెలిసిందే కదా!

పిల్ల కాలవలు దాటడానికి
తాటి చెట్టు ప్రధాన కాండాన్ని 
( మొద్దు లేక దూలం అంటారు ) 
అట్నుంచి ఇటు 
వేసి... దర్జాగా దాటేసేవాళ్ళు !

ఈ మినీ బ్రిడ్జిలను ఆధారం చేసుకుని
మన సినిమాల్లో.... ఎన్నో రొమాంటిక్ సీన్స్ క్రియేట్ చేశారు దర్శకులు !
పెళ్ళి మొదలైన
శుభకార్యాలన్నింటికి...
తాటాకు పందిరి వేసుకుంటాం.

వేసవి కాలానికి సరైన 
జోడీ తాటి చెట్టు !

వేసవి కాలంలో 
ఉక్కపోత తట్టుకుంటూ... 
హాయిగా నిద్రపోవడానికి, 
విశ్రాంతి తీసుకోవడానికి, 
నడుం వాల్చడానికి,
ఈ పందిళ్ళు చక్కగా ఉపయోగపడతాయి.

పొద్దున్నే ముఖం కడుక్కుని...
తాటాకు బద్దతో... 
నాలుక శుభ్రం చేసుకునే వాళ్ళం. 

ఇంటికి చుట్టాలెంత మందొచ్చినా...
మధ్యాహ్నం పప్పూ, ఆవకాయ, పల్చటి మజ్జిగన్నం పెట్టి...

ఈ తాటాకు పందిళ్ళ కింద.. 
తాటాకు చాపలేసి పడుకోమని....
తాటాకుతో చేసిన విసనికర్ర చేతికిస్తే...
అదే స్వర్గానికి బెత్తెడు దూరం... ఏసీలు బలాదూర్ !

#తాటి_ముంజెలు - #కాయలు !

అలా గాఢంగా కునుకు తీస్తున్న వారిని తాటి ముంజలతో నిద్ర లేపితే... విసుగు రాకపోగా..
ఒక స్వర్గంలోంచి మరొక స్వర్గంలోకి
తీసుకెళుతున్న అనుభూతి‌ పొందుతారు!

సీజన్ లో తిన్నన్ని తినగా..
మిగిలిపోయినవి... పండిపోయి బంగారు రంగులోనూ, ఇంకాస్త ముదురు రంగులో ఊరిస్తాయి.
వీటిని పండు తాటికాయలంటాం కదా!
వీటిని కాల్చి, పై తోలు తీసి...
తింటుంటే.... ఆ రుచిని పోల్చుకోవడానికి మరొకటేదీ లేదు !

దీనితోనే కొన్ని ప్రాంతాల్లో తాటి గారెలు చేస్తారు !

ఆ పండు తాటికాయల గుజ్జునే
చక్కగా పిండి, చాపల మీద పోసి‌
పల్చగా ఎండబెట్టి,  ముక్కలు ముక్కలుగా కోసి... స్వీటు కింద అమ్ముతారు.. ! తాటి చాప లంటారు !
అదీ ఒక అమృత స్వరూపమే !
సహజ తీపి రుచుల్లో అదొక ప్రత్యేకత !

బి విటమిన్ పుష్కంగా లభిస్తుంది తాటి పండులో !

ఇలా పండిపోయిన కాయల్ని, 
ఎండ బెట్టి, నేలలో పాతి పెడితే తేగలు వస్తాయి...
ప్యూర్ ప్రొటీన్స్ కల ఈ తేగలు
ఎంతో బలవర్థకమైనవి.

#తాటి_కల్లు :

ఇలా.... ఇంటిల్లిపాదీ... ఎంతో ఇష్టపడే  ఆహార పదార్థాలను అందించే తాటి‌ చెట్టు.... దేవతలు సేవించే.... 
సురాపానానికి... ఏ మాత్రం తీసిపోని ఆరోగ్య పానీయం తాటి కల్లునీ అందిస్తుంది.

ఆధునిక హ్రస్వదృష్టి చదువుల వల్ల
చాలా మందికి దీనిపై చిన్న చూపున్నప్పటికీ.. సంపూర్ణ ఆరోగ్య ప్రదాత తాటి కల్లు !
సహజంగా తయారైనది !

ఈ కల్లుతోనే తాటి బెల్లం తయారు చేస్తారు ! పంచదార, బెల్లం, పటిక బెల్లం కంటే... ఈ తాటి‌ బెల్లం ఎంతో ఆరోగ్యకరమైంది. 

ఆయుర్వేదం లోనూ తాటి కల్లునూ, తాటి బెల్లాన్నీ ఔషధంగా వాడతారు.

కల్లు గీయని చెట్లకే ముంజెలొస్తాయి. అంటే కల్లు తయారయ్యే పదార్థమే..
ముంజె గా మారుతుంది !
వీటిని ఆడ తాటి చెట్లంటారు !

ఇక మగ తాటి చెట్ల (పోతు తాటి చెట్టు ) నుంచీ కల్లు తీస్తారు.

ఆయుర్వేద రీత్యా, ఈ కల్లు ఇంకా శ్రేష్ఠమని చెప్తారు‌ !

ఇక చెట్ల నుంచి వచ్చే గెలల్ని, గులకలుగా చేసి, భాస్వరం, సూరేకారం లాంటివి కలిపి,
దీపావళి కి పూల పొట్లాలుగా తయారు చేసుకుని పిల్లలు ఆనందంగా తిప్పుకుంటారు !
అలా... ఇప్పటిలా.. పర్యావరణ హాని జంఝాటం లేకుండా దీపావళి కి రోజుల తరబడి పిల్లలు ఆనందంగా గడిపేవారు ! పైసా ఖర్చు లేకుండా !

సాయంత్రం వేళ... 
పిల్లలు ఆడుకోవడానికి... 
ఖాళీ తాటిబుర్రలతో చేసిన చక్రాల బండితో వచ్చే సంతోషం...
ఎన్ని ప్లాస్టిక్ ఆటబొమ్మలతో 
రాదన్నది మనందరికి అనుభవమే !

మన ఇళ్ళు శుభ్రం చేసుకోవడానికి, బూజులు దులపడానికి వాడే చీపుర్లను... తాటి గెలలకు వచ్చే ఆకుల్నే...అందంగా
అల్లి చీపుర్లుగా చేస్తారు.

తాటాకు మొదట్లో ఉండే ఒక మెత్తని ఫైబర్ లాంటి మెటీరియల్..
నెమలిపింఛాలకు ఆహారమని,
పిల్లల్ని పెడతాయని,
మన చిన్నప్పుడు... ఆ రెంటినీ కలిపి పుస్తకాల్లో దాచుకోవడం మనందరికీ గుర్తింది కదా!

బదనిక అనేది పరాన్న మొక్క.
అంటే... అది భూమిలో మొలచి
జీవించదు. చెట్లపై మొలచి తన వేళ్ళను ఆ చెట్ల కొమ్మల్లోని చిప్పించి రసాన్ని పీల్చి బతుకుతుంది. దాన్నే బదనిక లేదా వదనిక అంటారు.

ఇలా.. వేప చెట్టుపై మొలిస్తే దానిని
వేప బదనిక అని, చింత చెట్టుపై
మొలిస్తే దానిని చింత బదనిక అని పిలిస్తారు. అలా తాటి చెట్టు పై మొలచిన దానిని తాటి బదనిక అంటారు. 

ఆయుర్వేదంలో మూలికా 
వైద్యానికి దీనిని వాడతారు. 
అలానే పూజల్లోనూ విశేషంగా వాడతారు !

ఒక రకంగా.... 
మన పూర్వీకుల ప్రకృతి 
ఆధారిత నాగరిక జీవనానికి... 
ఎంతో ఆలంబనగా నిలిచింది 
తాటి చెట్టు.

ఇప్పటి తరాలకు.... 
కల్లు ఇచ్చే చెట్టుగా మాత్రమే పరిచయమున్న తాటి చెట్టు.... 
సరిగ్గా చెప్పాలంటే...
మన ప్రాచీన సమాజపు ఆర్థిక వ్యవస్థకు మూల స్థంభం ! 
మన పూర్వీకుల సాంకేతిక నైపుణ్యానికి ఆయువుపట్టు తాటిచెట్టు !

కాబట్టే..... 
ఈ చెట్టునే జీవనాధారంగా చేసుకుని
గౌడ కులం గౌరవ ప్రదంగా హుందాగా
ఇప్పటికీ జీవిస్తోంది. 
కల్లు గీత కార్మికులుగా వీరంతా మనకు సుపరిచితులు !

తాటి చెట్టుకి మొక్కి కానీ,
పనిలోకి దిగరు వారు !
అంత పవిత్రంగా, తమ పాలిట కల్పవృక్షంగా ఆరాధిస్తారు.

కల్పవృక్షం అన్న బిరుదు కు పోటాపోటీగా నిలిచే చెట్లలో తాటి చెట్టుది‌ అగ్రస్థానమేనని చెప్పొచ్చు.

****************************
ఆధునిక వ్యవస్థ వచ్చాక... 
అన్ని కులవృత్తులూ కాలగర్భంలో కలిసిపోయాయి. 
అందరూ ఒకటే చదివేది ఒకటే !
అందరికీ మిగిలింది ఒక్కటే !
నిరుద్యోగం !

అలానే ఆధునిక వ్యవసాయంలో
తాటి చెట్టు పెద్ద అడ్డంకి గా మారింది‌.
ఆధునిక ఆలోచనలకు పదును పెట్టి‌న మన వాళ్ళు... తాటి చెట్టు తల‌నరికి
ఎందుకు పనికి రాకుండా నాశనం చేస్తున్నాడు.

దీని వల్ల గౌడ కులస్థులకు పనిలేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు !

నిజానికి చితికి పోతోంది 
వాళ్ళు కాదు !
మనం ! మన వ్యవస్థ !
మన ఆర్థిక మరియు 
పర్యవరణ సమతుల్యత !
తక్షణం మేల్కొందాం !

పర్యావరణ హితకరమైన మెటీరియల్స్ సాధ్యమైనన్ని ఎక్కువ ఉత్పత్తులు ప్రారంభించి మన భవిష్యత్తు తరాలకు ఇబ్బందులు లేకుండా చేద్దాం !

తాటి చెట్టు మన తల్లి !

No comments:

Post a Comment

దీనిని పుజీ అంటారు . అతీంద్రియ శక్తులే మనను ఆవహించి భవిష్యత్ ను తెలియజేస్తాయని ఓ నమ్మకం .

మంత్ర సాధన కల్పద్రుమమ్ ఊజా బోర్డ్ :- ఊజా అంటే స్పానిష్ భాషలో లిపిఫలకం అని అర్థం .  దీనిని సా. శ ౧౧౦౦.పదకొండు వందల సం . ప్రాంతంలో  చైనాలో విర...